ఆనందం మన సహజ ప్రకృతి. దుఃఖం వికృతి. ఆనందం భగవంతుని సృష్టి. మానవుడు విశ్వామిత్రుడి త్రిశంకుస్వర్గంలా తానుగా మరో సొంత సృష్టి చేసుకున్నాడు. అదే దుఃఖం. దుఃఖం రెండు రకాలు. స్వయంగా అనుభవించేది. ఇతరులచేత అనుభవింపజేసేది. మొదటిదే తప్పు. ఇక రెండోది నేరం, మహాపరాధం. అనవసరంగా ఇతరులను బాధపెట్టే హక్కు మనకు లేదు.వీలైతే ఆనందపరచాలి. సంతోషపెట్టాలి. నవ్వించాలి. నవ్వులు పంచాలి.ఒక శిల్పి తన కళా నైపుణ్యంతో శిలను కూడా నవ్విస్తాడు. ఆ శిల్పంలోని చిరునవ్వు ఎంత సజీవంగా ఉంటుందంటే అప్రయత్నంగా, ఆనందంగా మన పెదాలూ చిరునవ్వుతో వికసిస్తాయి. బండరాతి శిలను కూడా నవ్వించగల మనిషి మరో మనిషి నెందుకు నవ్వించలేడు!? పైపెచ్చు ఎందుకు ఆ నవ్వును దోచుకునే ప్రయత్నం చేస్తాడు!? మనిషి తప్ప మిగిలిన జీవజాలం ఏదీ నవ్వలేదు. నవ్వించలేదు. మనిషికొక్కడికే దేవుడు ఆ శక్తినిచ్చాడు. ఆ వరాన్నిచ్చాడు. మరి మనిషి ఎందుకు దాన్ని ఉపయోగించుకోవటం లేదు?!
No comments:
Post a Comment